తల్లిపాలపై విస్తృత అవగాహన కల్పించాలి
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్లు
కాకతీయ, కరీంనగర్ : శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో అవసరమని, వాటి ప్రాముఖ్యతపై గ్రామస్థాయి వరకు విస్తృత అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈనెల 7వ తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అశ్విని తానాజీ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, వారి కుటుంబ సభ్యులకు తల్లిపాల ఆవశ్యకతపై సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు. శిశువు జన్మించిన గంటలోపే ముర్రుపాలు పట్టించడం ఎంతో కీలకమని, ముర్రుపాలలో ఉండే రోగనిరోధక శక్తి శిశువు ఆరోగ్యవంతంగా ఎదగడానికి దోహదపడుతుందని తెలిపారు.
మహిళా, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సందర్శించి గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. పుట్టినప్పటి నుంచి తొలి ఆరు నెలలు తప్పనిసరిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం అనుబంధ ఆహారంతో పాటు రెండేళ్ల వయస్సు వరకు తల్లిపాలను కొనసాగించాలని వివరించారు.
స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాల్లో ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహించి తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఐసిడీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

