జాతీయ యోగా పోటీలకు రమదేవి స్కూల్ విద్యార్థులు
రీజినల్ టోర్నీలో మూడు స్వర్ణ పతకాలతో సత్తా
కాకతీయ, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని నాసర్ స్కూల్‌లో నిర్వహించిన సీఐఎస్‌సీఈ రీజినల్ యోగా టోర్నమెంట్‌లో రమదేవి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పోలగోని గౌతమ్ గౌడ్, దేవరశెట్టి సాయి హర్షిత్ విశేష ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. అండర్-17 ట్రెడిషనల్ ఇండివిడ్యువల్ యోగాసన విభాగంలో పోలగోని గౌతమ్ గౌడ్ స్వర్ణ పతకం సాధించగా, అండర్-17 ఆర్టిస్టిక్ ఇండివిడ్యువల్ విభాగంలో దేవరశెట్టి సాయి హర్షిత్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. అండర్-17 ఆర్టిస్టిక్ పెయిర్ యోగాసన విభాగంలో గౌతమ్ గౌడ్–సాయి హర్షిత్ జోడీ మరో స్వర్ణ పతకం గెలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. మోక్షాస్ యోగా అకాడమీలో కోచ్ నరేష్ శిక్షణలో సాధన చేసిన విద్యార్థుల విజయాన్ని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించి తెలంగాణకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

