బీజేపీ విధానాలపై 14 వరకు సీపీఐ ప్రచార యాత్ర
పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
కాకతీయ, కరీంనగర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీపీఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుంచి 14 వరకు జిల్లావ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు ప్రచార యాత్ర నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డితో కలిసి ప్రచార యాత్ర వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నికల హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్య, వైద్య రంగాల్లోని ఇబ్బందులపై ప్రజలకు అవగాహన కల్పించడమే యాత్ర లక్ష్యమన్నారు. ఆగస్టు 6న కరీంనగర్ పద్మనగర్‌లో ప్రారంభమయ్యే యాత్రలో సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

