పీఎం కిసాన్‌కు మరో ఐదేళ్ల పొడిగింపు
2030-31 వరకు కొనసాగనున్న పెట్టుబడి సాయం
కొత్త పట్టాదారులకు ఇంకా అందని లబ్ధి
కాకతీయ, కరీంనగర్ : రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు మరో ఐదేళ్లు పొడిగించింది. ఇందుకోసం రూ.3.15 లక్షల కోట్ల వ్యయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 2.24 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ.6,000 చొప్పున మూడు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. పథకం పొడిగించినా 2019 తర్వాత భూములు కొనుగోలు చేసిన రైతులు, కుటుంబ విభజనతో కొత్త పట్టాదారులుగా నమోదైన వారికి పీఎం కిసాన్ వర్తింపుపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త నమోదులకు పోర్టల్‌లో అవకాశం లేకపోవడం, ఈ-కేవైసీ, ఆధార్ సీడింగ్, భూ రికార్డుల అనుసంధానంలో సాంకేతిక సమస్యలతో వేలాది మంది రైతులు పథకానికి దూరమయ్యారు. కొత్త నమోదులు ప్రారంభించి, అర్హులైన రైతులందరికీ పీఎం కిసాన్ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

