నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు
సైబర్, గల్ఫ్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి
పాత నేరస్తులపై నిరంతర నిఘా : ఎస్పీ మహేష్ బి.గితే
కాకతీయ, రుద్రంగి : నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పోలీసు సిబ్బందిని ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం రుద్రంగి పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌లో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పెట్రోలింగ్, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘాను సమీక్షించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని సూచించారు. సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, సీసీటీఎన్‌ఎస్ సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, నకిలీ ఉద్యోగ ప్రకటనలు, వీసా మోసాలు, గల్ఫ్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. బ్లూకోల్ట్, పెట్రోకార్ సిబ్బంది గ్రామాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, అనుమానితులు, హిస్టరీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు. మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ‘నేను సైతం’ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ తనిఖీలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, ఎస్‌ఐ మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు.

