కుల వివక్షకు కేరాఫ్ బీజేపీ
ఖర్గే ప్రసంగించిన వేదికను శుద్ధి చేయడం దారుణం
కులం పేరుతో అవమానించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కాకతీయ, వేములవాడ : దళిత నాయకుడు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను శుద్ధి పేరుతో హవనం చేయడం కుల వివక్షకు, సామాజిక విభజనకు నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కులం పేరుతో ఒకరిని అవమానించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. హల్ద్వానీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన విజయ్ శంఖనాద్ సభలో ఖర్గే ప్రసంగించారు. రెండు రోజుల అనంతరం శ్రీరామ్ సేన కార్యకర్తలు అదే వేదిక వద్ద శుద్ధీకరణ హవనం నిర్వహించడంపై ఆది శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు.
కుల వివక్షకు వ్యతిరేకంగా
ఖర్గే దళిత సమాజానికి చెందిన జాతీయ స్థాయి నాయకుడని, ఆయన ప్రసంగించిన ప్రదేశాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఒక వ్యక్తి కులం ఆధారంగా ఆయన మాట్లాడిన వేదికను అపవిత్రంగా భావించడం ఎలాంటి సామాజిక న్యాయమని నిలదీశారు. రాజకీయ అభిప్రాయాలు భిన్నంగా ఉండొచ్చని, కానీ కులం, మతం పేరుతో ప్రజలను విభజించడం, వ్యక్తుల గౌరవాన్ని కించపరచడం సమర్థనీయం కాదన్నారు. బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ప్రజలను విభజించే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. మానవత్వం, సమానత్వం, సామాజిక న్యాయం, సోదరభావమే రాజ్యాంగ స్ఫూర్తి అని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

