స్కాలర్‌షిప్ విద్యార్థులకు ఇస్తున్న దానం కాదు
పెండింగ్ రీయింబర్స్‌మెంట్ వెంటనే చెల్లించాలి
కోర్టు ఆదేశాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది
మంత్రుల క్యాంపు కార్యాలయాల ముట్టడి
పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్లను విడుదల చేయాలి
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ
కాకతీయ, ఖమ్మం : స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న దానం కాదని, వారి హక్కు అని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ అన్నారు. పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయాలను విద్యార్థులు ముట్టడించారు. విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంట్ తమకు ఇవ్వాలని నినాదాలు చేశారు. నిరసనను పోలీసులు అడ్డుకుని పీడీఎస్‌యూ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో క్యాంపు కార్యాలయాల వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. కాంపాటి పృథ్వీతో పాటు పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు టి. లక్ష్మణ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మునిగల శివ ప్రశాంత్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
చదువులకు ఆటంకంగా జాప్యం
కాంపాటి పృథ్వీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా రీయింబర్స్‌మెంట్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించడం లేదన్నారు. ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. రీయింబర్స్‌మెంట్ అందకపోవడంతో పరీక్ష ఫీజులు, పుస్తకాలు, ప్రయాణం, హాస్టల్, ల్యాబ్ ఖర్చులు భరించలేక ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, డిగ్రీ, ఇంటర్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొందరు చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పృథ్వీ ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్లను తక్షణమే విద్యార్థులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బుర్ర వీరభద్రం, నాయకులు సురేష్, హరిచంద్ర ప్రసాద్, రఘు, రామ్‌చరణ్, మనోజ్, సుశాంత్, గోపి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

