ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం
సిమెంట్ బస్తాలు ఇస్తానంటూ ఇంటికి పిలిచిన గ్రామశాఖ అధ్యక్షుడు
భర్తకు తెలియడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ
కేసు పెట్టకుండా భూమి ఇస్తామంటూ రాయబారం
కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడి
కాకతీయ, భువనగిరి: ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం ఆత్మకూరు(ఎం) మండలంలో కలకలం రేపింది. ఓ గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు మాలి శంకర్‌రెడ్డి సిమెంట్ బస్తాలు ఇస్తానని మహిళను ఇంటికి పిలిచి అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. విషయం బాధితురాలి భర్తకు తెలియడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినట్లు సమాచారం. పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టకుండా బాధితురాలు, ఆమె భర్తను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు పెట్టకుండా అర ఎకరం భూమి ఇస్తామని పెద్దల ద్వారా రాయబారం నడిపినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు(ఎం) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరాలు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.

