బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.15 వేల కోట్లు.. వెంటనే విడుదల చేయాలి
22ఏ భూములపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
పెద్ద సంస్థలకు భూముల కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించకపోతే ఆందోళన
బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు
కాకతీయ, ఖమ్మం టౌన్ : విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతోందని ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారు రూ.15 వేల కోట్లకు చేరాయని, ప్రభుత్వం చెల్లింపుల్లో జాప్యం చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థులు, పార్టీ శ్రేణులతో కలిసి హైదరాబాద్లో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఖమ్మంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోటేశ్వరరావు మాట్లాడారు. ఫీజు బకాయిల కారణంగా కళాశాలలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, చదువులు, ఉన్నత విద్య, భవిష్యత్తు అవకాశాలపై ప్రభావం పడుతోందని అన్నారు. బకాయిల విడుదల కోసం మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్రావు చేపట్టిన నిరాహార దీక్షకు ఖమ్మం జిల్లా బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఖమ్మం నుంచి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులతో హైదరాబాద్కు తరలివెళ్లి ఆందోళనలో పాల్గొంటామని చెప్పారు.
22ఏ భూములపై సమాధానం చెప్పాలి
ఖమ్మం జిల్లాలో 22ఏ నిషేధిత భూముల జాబితా కారణంగా సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. భూములు కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్లు పూర్తయిన తర్వాత కూడా రికార్డుల్లో తలెత్తుతున్న వివాదాలతో ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. భూ రికార్డుల్లో పూర్తి పారదర్శకత తీసుకురావాలని కోరారు. సామాన్యుల భూములకు ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం పెద్ద సంస్థలకు భూముల కేటాయింపుల్లో ఏ విధానాన్ని అనుసరిస్తోందో వెల్లడించాలని ప్రశ్నించారు. ఫీనిక్స్ తదితర సంస్థలకు జరిగిన భూ కేటాయింపుల పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. భూముల స్వభావం, కేటాయింపు విధానం, అనుసరించిన నిబంధనలు, ప్రభుత్వానికి కలిగిన ప్రయోజనాలను వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ, అటవీ, దేవాదాయ భూముల విషయంలోనూ సమగ్ర పరిశీలన జరపాలని అన్నారు.
హామీల అమలులో విఫలం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కోటేశ్వరరావు విమర్శించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత, రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతులు, పంటల కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాతలు, ఉపాధి అవకాశాల కోసం చూస్తున్న నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని అన్నారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం ఇకనైనా నిర్ణయం తీసుకోకపోతే జర్నలిస్టుల తరఫున బీజేపీ ప్రత్యక్ష ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు. అవసరమైతే న్యాయపరమైన పోరాటం కూడా చేస్తామని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, 22ఏ భూముల వ్యవహారం, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోటేశ్వరరావు కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, నాయకులు మందడపు సుబ్బారావు, కృష్ణయ్య, రుద్రగాని మాధవ్రావు తదితరులు పాల్గొన్నారు.

