సాగుకు సిద్ధం చేస్తున్న ఎస్సారెస్పీ భూములు!
దుక్కులు దున్ని.. పైపులైన్లు వేసి సాగుకు ఏర్పాట్లు
అధికారుల హెచ్చరికల తర్వాతా ఆగని ఆక్రమణ పనులు
చెట్లు పెంచుతామన్న అధికారుల మాటలు.. క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితి
చర్యలు లేకపోవడంపై అధికారుల తీరుపై అనుమానాలు
కాకతీయ, శంకరపట్నం : ప్రభుత్వ భూములకు రక్షణ కరువవుతోందా? అధికారులు హెచ్చరించినా ఆక్రమణ పనులు ఆగడం లేదా? కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులోని ఎస్సారెస్పీ భూముల విషయంలో ప్రస్తుతం ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆధీనంలోని భూమిని కొందరు దుక్కులు దున్ని, నీటి పైపులైన్లు ఏర్పాటు చేసి సాగుకు సిద్ధం చేస్తున్నా.. అధికారులు మాత్రం కఠిన చర్యలకు ఉపక్రమించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేశవపట్నం గ్రామ శివారులో ఎస్సారెస్పీ భూమిని సాగుకు సిద్ధం చేస్తున్న విషయం తెలుసుకున్న ఎస్సారెస్పీ ఏఈ పావని అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేయవద్దని సంబంధిత వ్యక్తిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ భూమిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో చెట్లు పెంచనున్నట్లు అధికారులు చెప్పినట్లు సమాచారం. ఆక్రమణకు పాల్పడితే కేసు నమోదు చేస్తామని కూడా స్పష్టం చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు హెచ్చరించి వెళ్లిన తర్వాత కూడా అదే భూమిలో ఆక్రమణ పనులు కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దుక్కులు దున్నడంతో పాటు నీటి పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. అధికారుల ప్రత్యక్ష పరిశీలన, హెచ్చరికల తర్వాత కూడా పనులు కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూమిలో సాగుకు ఇంత బహిరంగంగా ఏర్పాట్లు జరుగుతున్నా.. సంబంధిత అధికారులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అధికారుల తీరుపై అనుమానాలు
ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన అధికారులు కేవలం హెచ్చరికలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోకుండా వదిలేయడం వల్లే మళ్లీ పనులు కొనసాగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్వయంగా పరిస్థితిని పరిశీలించిన తర్వాత కూడా దుక్కులు దున్ని, పైపులైన్లు వేసే స్థాయిలో ఆక్రమణ పనులు కొనసాగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులపై ముడుపులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నప్పటికీ.. వాటికి సంబంధించి పూర్తిస్థాయి ఆధారాలు, అధికారిక నిర్ధారణ మాత్రం వెలువడాల్సి ఉంది. ఎస్సారెస్పీ భూమిలో ప్రస్తుతం జరుగుతున్న పనులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సారెస్పీ భూములను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. కేవలం హెచ్చరికలు జారీ చేసి వదిలేయకుండా.. ఆక్రమణలను అడ్డుకుని, ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కేశవపట్నం శివారులోని ఎస్సారెస్పీ భూములపై జరుగుతున్న ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల హెచ్చరికల తర్వాత కూడా పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇకనైనా అధికారులు కఠినంగా వ్యవహరిస్తారా? అన్నది వేచి చూడాలి.


