కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి
వేతన సంఘం గడువు దాటినా కాలయాపన ఎందుకు?
మున్సిపల్ కార్మికుల వేతనాల్లో కోత విధించొద్దు
రూ.26 వేల వేతనం అమలు చేయాలని డిమాండ్
జి. రామయ్య, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి
కాకతీయ, ఖమ్మం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, కార్మికులకు పీఆర్సీని వెంటనే ప్రకటించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామయ్య డిమాండ్ చేశారు. మంగళవారం రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు ఏ. వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రంగాల కార్మికుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదని రామయ్య ఆరోపించారు. పీఆర్సీ గడువు ముగుస్తున్నా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. వెంటనే పీఆర్సీ ప్రకటించి ఉద్యోగులు, కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. మున్సిపల్ కార్మికుల వేతనాలను తగ్గిస్తూ జూలై 15న రాష్ట్ర ప్రభుత్వం ఎండార్స్‌మెంట్ విడుదల చేసిందని రామయ్య ఆరోపించారు. జీవో నంబర్ 6లో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాలుగా మూడు జోన్లుగా విభజించినట్లు తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో నంబర్ 60 ప్రకారం మూడు కేటగిరీల్లో రూ.16,600, రూ.19,500, రూ.22,750 వేతనాలు అమలవుతున్నాయని వివరించారు. తాజా ఎండార్స్‌మెంట్ కారణంగా మున్సిపాలిటీ డ్రైవర్లు, పంప్ ఆపరేటర్లు, డేటా ఆపరేటర్లు, అటెండర్లకు ప్రస్తుతం అందుతున్న వేతనాల్లో రూ.1,000 నుంచి రూ.3,000 వరకు కోత పడే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ఇది మున్సిపల్ కార్మికుల పొట్టకొట్టడమేనని విమర్శించారు.
వేతనాలు పెంచాల్సింది పోయి తగ్గిస్తారా?
నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత వేతనాలు సరిపోక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని రామయ్య అన్నారు. వేతన సంఘం సిఫారసు చేసిన రూ.26 వేల వేతనం అమలు చేయాల్సింది పోయి వేతనాల్లో కోత విధించడం సరికాదన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మున్సిపల్, గ్రామపంచాయతీ, ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకం, ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులతో పాటు ఇతర రంగాల కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తాజా నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోకపోతే భవిష్యత్‌లో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సెప్టెంబర్ 6న ఖమ్మంలో నిర్వహించనున్న టీయూసీఐ రాష్ట్ర జనరల్ కౌన్సిల్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు సి.వై. పుల్లయ్య, కొయ్యల శ్రీనివాస్, ఎలదండి బాబు, జిల్లా సహాయ కార్యదర్శులు డి. శ్రీనివాసరావు, ఆవుల అశోక్, జిల్లా కోశాధికారి శరత్ తదితరులు పాల్గొన్నారు.

