రైతులకు సరిపడా యూరియా అందించాలి
ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్
ఎమ్మార్పీ ధరలకే యూరియా, కాంప్లెక్స్ ఎరువులు ఇవ్వాలి
ఫర్టిలైజర్ యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో
కాకతీయ, చేర్యాల: రైతులకు అవసరమైన మేరకు యూరియా, కాంప్లెక్స్ ఎరువులను ఎమ్మార్పీ ధరలకే అందించాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో మాట్లాడుతూ.. యూరియా ఫర్టిలైజర్ యాప్ విధానం రైతులకు ఇబ్బందులు కలిగిస్తోందని, వెంటనే దాన్ని రద్దు చేయాలని కోరారు. ఎరువుల దుకాణాల్లో నిల్వలు ఉన్నప్పటికీ రైతులకు యూరియా సకాలంలో అందడం లేదని ఆరోపించారు. ఎమ్మార్పీ ధరలకు మించి ఎరువులను విక్రయించడాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు అవసరం లేని ఇతర ఉత్పత్తులను కూడా కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడాన్ని నిలిపివేయాలని కోరారు. వ్యవసాయ శాఖలో ఏవో, ఏడీఏ వంటి శాశ్వత అధికారులను నియమించి ఎరువుల విక్రయాలను పర్యవేక్షించాలని సూచించారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే వారిని సమీకరించి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాగపురి కనకయ్య, తుప్పతిరాజు, రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

