వర్ధన్నపేట సర్కారు దవాఖానాలో దారుణం.. శవాన్ని పీక్కుతిన్న ఎలుకలు!
ఫ్రీజర్ లేకపోవడమే కారణమా? మార్చురీలో కనీస వసతుల కరువు – బంధువుల ఆందోళన
కాకతీయ, వర్ధన్నపేట: ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వం మరచిపోయే ఘటన చోటుచేసుకుంది. మార్చురీలో భద్రపరిచిన మృతదేహాన్ని ఎలుకలు కొరకడం వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కలకలం రేపింది.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన గారె వీరయ్య శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని శనివారం రాత్రి వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
అయితే ఆదివారం ఉదయం పోస్టుమార్టం కోసం కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా.. మృతదేహం కళ్లు, ముఖ భాగాల్లో ఎలుకలు కొరికిన గాయాలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురయ్యారు.
ఫ్రీజర్ సౌకర్యం లేదు..
మృతదేహాలను భద్రపరిచేందుకు మార్చురీలో ఫ్రీజర్ సౌకర్యం లేకపోవడం, పారిశుద్ధ్య లోపమే ఈ దారుణానికి కారణమని మృతుడి బంధువులు ఆరోపించారు. రాత్రంతా మృతదేహం అలాగే ఉండడంతో ఎలుకలు కొరికాయని వాపోయారు.
ఆసుపత్రి ఎదుట ఆందోళన..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ బంధువులు, స్థానికులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. మార్చురీలో ఫ్రీజర్, ఇతర వసతులు వెంటనే కల్పించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

