రూ.205 కోట్లతో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు
గృహజ్యోతి లబ్ధిదారులకు రూ.40.19 కోట్ల సబ్సిడీ
4 సబ్స్టేషన్ల ఏర్పాటు.. సౌర విద్యుత్ పనులు వేగవంతం
రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాకతీయ, ఏదులాపురం : పాలేరు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారానికి రూ.205 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం వరంగల్ క్రాస్‌రోడ్‌లోని తరుణీహట్ ప్రాంగణంలో టీజీఎన్పీడీసీఎల్ డివిజన్ కార్యాలయం, విద్యుత్ రెవెన్యూ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్‌దత్‌తో కలిసి ప్రారంభించారు. వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం 33 కేవీ ఇంటర్‌లింకింగ్ లైన్ ఫీడర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత 2 ఏళ్లలో 632 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించామని, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో 4 సబ్స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పాలేరు నియోజకవర్గంలో గృహజ్యోతి లబ్ధిదారులకు రూ.40.19 కోట్ల సబ్సిడీ వర్తించినట్లు తెలిపారు. నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో 1,350 మంది గృహ వినియోగదారులకు రూ.15.66 కోట్లతో 2,709 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ పలకల పనులు కొనసాగుతున్నాయన్నారు. రైతుల కోసం రూ.31.08 కోట్లతో సౌర విద్యుత్ సౌకర్య పనులు చేపట్టామని, అత్యవసర విద్యుత్ పునరుద్ధరణకు విద్యుత్ అంబులెన్స్ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. కార్యక్రమంలో మద్దినేని స్వర్ణకుమారి, మధుసూదన్‌రావు, తమ్మినేని నవీన్, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసచారి, నాగేశ్వరరావు, బానోత్ కిషోర్‌నాయక్, తోట వీరభద్రం, మద్ది మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

