రిజిస్ట్రేషన్, స్టాంప్స్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా హరికోట్ల రవి
మూడేళ్ల కాలానికి నూతన కార్యవర్గం ఎన్నిక
అసోసియేట్ అధ్యక్షురాలిగా తస్లీమా మొహమ్మద్.. కార్యదర్శిగా జి. నరేంద్ర
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ రిజిస్ట్రేషన్, స్టాంప్స్ గెజిటెడ్ అధికారుల సంఘానికి నూతన కార్యవర్గం ఎన్నికైంది. మూడేళ్ల కాలానికి నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా హరికోట్ల రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎన్నికల అధికారి జి. వెంకటేశ్వర్లు నూతన కార్యవర్గం ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. సంఘం అసోసియేట్ అధ్యక్షురాలిగా తస్లీమా మొహమ్మద్, కార్యదర్శిగా జి. నరేంద్ర, కోశాధికారిగా వి. సీతారామ్ ఎన్నికయ్యారు. వివిధ పదవులకు ఎన్నికైన వారితో కలిపి మొత్తం 33 మందితో నూతన కార్యవర్గం ఏర్పాటైంది. ఎన్నికల అనంతరం నూతన అధ్యక్షుడు హరికోట్ల రవి మాట్లాడుతూ సంఘ సభ్యుల ప్రయోజనాలు, అధికారుల సమస్యల పరిష్కారం, శాఖలో సమన్వయం కోసం నూతన కార్యవర్గం కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నికతో రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖలోని గెజిటెడ్ అధికారుల సమస్యలను సంఘం ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం ఏర్పడిందని సభ్యులు తెలిపారు. మూడేళ్ల కాలంలో సంఘాన్ని బలోపేతం చేయడంతోపాటు సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.

