ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలి
తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి నమోదు చేయాలి
ఎన్నికల ప్రధాన అధికారిని విధుల నుంచి తొలగించాలి
రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్ మావో డిమాండ్
కాకతీయ, చేర్యాల: కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్)ను నిలిపివేసి తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి నమోదు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్ మావో డిమాండ్ చేశారు. ఈ మేరకు చేర్యాల పాత బస్టాండ్ వద్ద ప్రజా, వృత్తి సంఘాల ఆధ్వర్యంలో నిరసన నిర్వహించి, జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మావో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ బీజేపీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తూ ఓటర్ల జాబితా నుంచి పౌరుల పేర్లను తొలగిస్తోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగిస్తాయని విమర్శించారు. ఓటు హక్కుకు సంబంధించిన ప్రక్రియను రాజ్యాంగ నిబంధనల ప్రకారం నిర్వహించాలని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోవాలని, రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకురాలు ఇప్పకయాల శోభతో పాటు ప్రజా, వృత్తి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

