ఎల్‌నినో పరిస్థితుల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి
ఖేత్ బచావో అభియాన్‌లో కేవీకే శాస్త్రవేత్త డా. శ్రీనివాసరెడ్డి సూచన
కాకతీయ,శంకరపట్నం: మొలంగూర్ రైతు వేదికలో మంగళవారం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్త డా. శ్రీనివాసరెడ్డి రైతులకు ఎల్‌నినో పరిస్థితులు, నీటి యాజమాన్యం, పంటల సంరక్షణ, నేల ఆరోగ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగుకు దూరంగా ఉండి, తక్కువ కాలపరిమితి, తక్కువ నీటి వినియోగం కలిగిన అపరాలు, నూనెగింజలు, ఇతర ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేసుకోవాలని, నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వ్యవసాయం చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మక్తా సర్పంచ్ నెలవేనీ మహేష్, ఏఈవో కీర్తన, ఉపసర్పంచులు ఎదురు గట్ల శ్రీనివాస్, సుభాష్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.

