రైతుల కష్టాలు తెలియని పల్లాకు మాట్లాడే హక్కు లేదు
చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి
పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదు
కాకతీయ, చేర్యాల : రైతుల కష్టాలు తెలియని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆయన పల్లా విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం చేర్యాల పట్టణంలోని వాసవి కాటన్ ఇండస్ట్రీస్‌లో భారత పత్తి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరుకాని పల్లా, కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. రైతుల కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వారి సంక్షేమం గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రైవేటు కార్యక్రమాలపై చూపే శ్రద్ధను రైతులకు సంబంధించిన కార్యక్రమాలపైనా చూపాలని సూచించారు. “శుష్కప్రియాలు.. శూన్యహస్తాలు అన్న చందంగా పల్లా వ్యవహారశైలి ఉంది. మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప దాటడం లేదు” అని ఎద్దేవా చేశారు. రైతుల పక్షాన నిలబడి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లకు చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

