షార్ట్ సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట బుగ్గిపాలు
కాకతీయ, రఘునాథపాలెం : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రఘునాథపాలెం గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఓ రైతు తీవ్ర నష్టాన్ని చవిచూశాడు. గ్రామానికి చెందిన రైతు కాట్రాల పుల్లయ్యకు చెందిన 4 ఎకరాల మొక్కజొన్న పంట షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైంది. పొలం మధ్యగా వెళ్తున్న 11 కెవి విద్యుత్ లైన్ వైర్లు ప్రమాదకరంగా కిందికి వేలాడుతున్నాయి. ఈదురుగాలుల కారణంగా వైర్లు ఒకదానికొకటి తగిలి షార్ట్ సర్క్యూట్ ఏర్పడి నిప్పురవ్వలు పడటంతో పంటమొత్తం అంటుకుంది. క్షణాల్లోనే మంటలు వ్యాపించి మొత్తం పంట బుగ్గిపాలైంది. “కోతకు సిద్ధంగా ఉన్న పంట ఇది. ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టా. మొత్తం 4 ఎకరాలకు దాదాపు రూ.1.6 లక్షలు ఖర్చు చేశా. అప్పులు చేసి సాగు చేశా… ఇప్పుడు ఒక్క గింజ కూడా మిగలలేదు” అంటూ రైతు పుల్లయ్య కన్నీటి పర్యంతమయ్యాడు.
4 ఎకరాల్లో సుమారు 80 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించగా, మార్కెట్ ధర ప్రకారం రూ.1.5 లక్షల నుంచి రూ.1.8 లక్షల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి బాధిత రైతుకు పరిహారం అందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ లైన్లను వెంటనే సరిచేయాలని కోరుతున్నారు.

