ఇద్దరు ఏఎన్ఎంలకు షోకాజ్ నోటీసులు
విధుల్లో గైర్హాజరు పై అధికారుల ఆగ్రహం
కాకతీయ, హుజూరాబాద్ : మండలంలోని కందుగుల ఆరోగ్య ఉపకేంద్రంలో విధుల్లో గైర్హాజరైన ఇద్దరు ఏఎన్ఎంలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించగా, చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఈ ఉపకేంద్రంలో ఏఎన్ఎంలు సైదా, సుమలత విధులకు హాజరుకాకపోవడం గుర్తించారు. ఈ తనిఖీలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సదానందం కూడా పాల్గొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరు కావడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఇద్దరు ఏఎన్ఎంలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, గైర్హాజరుకు గల కారణాలను వివరణాత్మకంగా తెలియజేయాలని ఆదేశించారు. సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఉన్నతాధికారులకు నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజారోగ్యానికి సంబంధించిన సేవలు గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం అందుబాటులో ఉండేలా సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. లేనిపక్షంలో కఠిన శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

