కార్మికుల శ్రమ..కాంట్రాక్టర్ల దోపిడీ
వేతనాలు పెంచకపోతే మే 25న మహాధర్నా
జీవో అమలు చేయకుండా కాంట్రాక్టర్ల కుట్రలు
ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా నేరుగా జీతాలు చెల్లించాలి
ఉద్యోగ భద్రత, కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలి
సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రం
ఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య
కాకతీయ, ఖమ్మం టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మహాధర్నా నిర్వహిస్తామని ఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య హెచ్చరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సుమారు 17 వేల మంది బెడ్‌సైడ్ కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 2022లో ప్రతి కార్మికుడికి నెలకు రూ.15,600 వేతనం ఇవ్వాలని జీవో జారీ చేసినప్పటికీ, కాంట్రాక్టర్లు ఆ ఆదేశాలను పట్టించుకోకుండా రూ.10,000–11,000 మాత్రమే చెల్లిస్తూ కార్మికులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలవారీగా, ప్రాంతాలవారీగా వేతనాల్లో తేడాలు చూపిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమస్యలపై ఎస్పీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, ప్రతి కార్మికుడికి కనీస వేతనం రూ.26,000 చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీతాలను నేరుగా ఐఎఫ్ఎంఐఎస్ వ్యవస్థ ద్వారా చెల్లించే విధానం అమలు చేయాలని, మధ్యవర్తుల జోక్యాన్ని తొలగించాలని కోరారు.
కార్మికుల హక్కులపై ప్రధాన డిమాండ్లు
కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఐహెచ్ఎఫ్ఎంఎస్ నుంచి ఐఎఫ్ఎంఐఎస్ వ్యవస్థలోకి విలీనం చేయాలని, ఎంప్లాయీస్ షేర్ మొత్తాన్ని ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ , హెల్త్ కార్డులు అందించాలని, జీతాలు ప్రతినెల ఐదో తేదీ లోపు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా కార్మికులకు వేతనంతో కూడిన నెలసరి సెలవులు, ప్రసూతి సెలవులు కల్పించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా డ్యూటీకి వచ్చేటప్పుడు లేదా తిరిగి వెళ్లేటప్పుడు ప్రమాదం జరిగి మరణించిన కార్మిక కుటుంబానికి రూ.10 లక్షల ప్రమాద బీమా, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల అప్‌గ్రేడ్‌కు అనుగుణంగా తగిన సిబ్బందిని నియమించి పనిభారం తగ్గించాలని సూచించారు.
సమస్యలు పరిష్కరించకపోతే మహాధర్నా
ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే మే 25న తెలంగాణలోని 33 జిల్లాల కార్మికులు హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహిస్తారని ఎస్పీఎస్ నేతలు హెచ్చరించారు. ఇప్పటికే డీఎంఈ కార్యాలయానికి లేఖ అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు మాతంగి అనిల్ కుమార్, సహాయ కార్యదర్శి గొర్రె నాగరాజు, గాంధీ ఆస్పత్రి నాయకులు ఆనంద్, మురళి, రమణ, అనిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా ముదురుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోకపోతే ఆందోళనలు మరింత ఉధృతమయ్యే అవకాశముంది.

