వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం
శంకరపట్నంలో శాస్త్రోక్త పూజలు..ఆధ్యాత్మిక వాతావరణం
పరిసర గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు
కాకతీయ, శంకరపట్నం : కేశవపట్నం గ్రామంలోని అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ గోదా రంగనాయక స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, హోమాలు, మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవ వేళ ఆలయాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారికి ప్రత్యేక సేవలు సమర్పించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తం కార్యక్రమం భక్తి పరవశంలో శోభాయమానంగా కొనసాగింది.

