మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దహనం
ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ధర్నా
ఖర్గే వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనం
బీజేపీ కోరుట్ల పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మినారాయణ
క్షమాపణ చెప్పకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక
కాకతీయ, కోరుట్ల: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కోరుట్ల పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్న ప్రధాని మోదీని ‘తీవ్రవాది’ అంటూ సంబోధించడం ఖర్గే అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. వయసు పైబడటంతో ఖర్గే మతిభ్రమించి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను వెంటనే పదవి నుండి తొలగించి మంచి ఆసుపత్రిలో చికిత్స చేయించాలని ఎద్దేవా చేశారు.
ఇళ్ల ముందు నిరసనలు తప్పవు
భారతీయ జనతా పార్టీ నాయకులపై గానీ, ప్రధానిపై గానీ ఇకనైనా నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని లక్ష్మినారాయణ హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే కాంగ్రెస్ నాయకుల ఇళ్ల ముందు వారి దిష్టిబొమ్మలను దహనం చేస్తామని హెచ్చరించారు. దేశ గౌరవాన్ని దిగజార్చేలా మాట్లాడటం కాంగ్రెస్ సంస్కృతి అని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడు తుక్కారం గౌడ్, పట్టణ కౌన్సిలర్లు కాలాల రాధ సాయిచంద్, సోరుపాక రమాదేవి రమేష్, గుగ్లావత్ శ్రీకాంత్, తిరుమాల వాసు పాల్గొన్నారు. అలాగే పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేందర్, గిన్నెల శ్రీకాంత్, మండల అధ్యక్షుడు పంచారి విజయ్, బీజేవైఎం నాయకులు వెంకట్ రెడ్డి, రాజు, విజయ్ మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

