ఇటుక బట్టీల నుంచి.. బడి బాటలోకి!
వలస జీవుల పిల్లల విద్యా ప్రగతికి ‘బ్రిక్ టు బుక్స్’
66 మంది విద్యార్థులకు ప్రగతి పత్రాల అందజేత
గట్టుబూత్కూర్‌లో వినూత్న వర్క్ సైట్ స్కూల్
కాకతీయ, గంగాధర: ఉపాధి కోసం వలస వచ్చిన ఇటుక బట్టీ కార్మికుల బిడ్డల జీవితాల్లో విద్యా వెలుగులు నింపేందుకు ‘బ్రిక్ టు బుక్స్’ వర్క్ సైట్ స్కూల్ ఆశాజ్యోతిగా నిలుస్తోంది. గంగాధర మండలంలోని గట్టుబూత్కూర్‌లో నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో శిక్షణ పొందిన 66 మంది చిన్నారులకు ఐదు నెలల విద్యా పురోగతి అనంతరం గురువారం ప్రగతి పత్రాలను అందజేశారు. ఇటుక బట్టీల వద్ద పనిచేసే వలస కార్మికుల పిల్లలకు ఈ విధంగా విద్యా గుర్తింపునిస్తూ ప్రగతి పత్రాలు అందించడం జిల్లాలోనే ఇది తొలిసారి కావడం విశేషం. వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికుల పిల్లలకు వారి తల్లిదండ్రుల పని ప్రదేశాల వద్దే విద్యావకాశం కల్పించడం ఈ స్కూల్ లక్ష్యం. ఐదు నెలల కాలంలో వీరికి గణితం, ఆంగ్లం, చిత్రలేఖనంతో పాటు ప్రాథమిక అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి విద్యా పునాది వేశారు. ఈ ప్రగతి పత్రాల ద్వారా వీరు భవిష్యత్తులో ఎక్కడికి వలస వెళ్లినా, ఆయా ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యను కొనసాగించేందుకు వీలుంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఆదర్శంగా వర్క్ సైట్ స్కూల్..
పిల్లల విద్యా హక్కును కాపాడుతూ, వారిని బాలకార్మికులుగా మారకుండా ఈ వర్క్ సైట్ స్కూల్ అడ్డుకుంటోంది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్ రావు, ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, సిఆర్పీ మధుకర్, విద్యా వాలంటీర్లు జ్యోతి, కావ్య తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. చదువే ఆ పిల్లల భవిష్యత్తుకు నిజమైన ఆస్తి అని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

