బండి ఇది తొండి
కో-ఆప్షన్ ఎన్నికల్లో పారదర్శకత ఎక్కడ?
బండి సంజయ్‌ది అంతా తొండి రాజకీయం
చట్టవిరుద్ధంగా ఎన్నికల నిర్వహణ
అర్హత లేని వారిని ఎన్నుకుంటే న్యాయపోరాటం తప్పదు
మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ ఆరోపణలు
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలను నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నారని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. నగరంలోని 66 మంది కార్పొరేటర్లకు కనీస సమాచారం లేకుండా ఈ ప్రక్రియను సాగించడం దారుణమన్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ, స్క్రూటినీ అనంతరం జాబితాను బహిర్గతం చేయాల్సి ఉంటుందని రవీందర్ సింగ్ గుర్తుచేశారు. “ఎవరు పోటీ చేస్తున్నారు? వారి అర్హతలు ఏమిటి? క్రిమినల్ కేసులు ఉన్నాయా? వంటి వివరాలు కార్పొరేటర్లకు తెలియకుండా దాచడం వెనుక అంతర్యమేమిటి?” అని ప్రశ్నించారు. రామగుండంలో అర్హత లేని అభ్యర్థుల వల్ల ఎన్నికలు వాయిదా వేసిన అధికారులు, ఇక్కడ అదే చట్టాలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.
ఇది బీజేపీ అంతర్గత ఎన్నికలా?
కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించిన రవీందర్ సింగ్.. “బండి సంజయ్ తొండి చేస్తున్నాడు.. ఇది కౌన్సిల్ ఎన్నికలా లేక బీజేపీ అంతర్గత ఎన్నికలా?” అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఒకలా, గెలిచిన తర్వాత మరోలా వ్యవహరించడం ధర్మం కాదని హితవు పలికారు. కేవలం పత్రికల ద్వారానే వివరాలు బయటకు రావడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. మున్సిపల్ యాక్ట్-2019 ప్రకారం ప్రాతినిధ్యం లేని వర్గాలకు అవకాశం కల్పించకుండా, నిబంధనలు అతిక్రమిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పారదర్శకత లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అవసరమైతే ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. వెంటనే అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేసి, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లను డిమాండ్ చేశారు.

