తలంబ్రాల మహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం
ముత్తారం రామాలయంలో ఈ నెల 27న వేడుక
రోడ్డు మంజూరుపై ఎమ్మెల్యే కవ్వంపల్లికి కృతజ్ఞతలు
కాకతీయ, శంకరపట్నం: మండలంలోని ముత్తారం గ్రామంలో వెలిసిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి తలంబ్రాల మహోత్సవానికి రావాల్సిందిగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను గ్రామ ప్రజాప్రతినిధులు ఆహ్వానించారు. ఈ నెల 27న సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న ఈ వేడుకకు హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ముత్తారం చెరువు నుంచి తాడికల్‌కు వెళ్లే దారిని డాంబర్ రోడ్డుగా మంజూరు చేసినందుకు గ్రామస్థులు ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజల రాకపోకలకు ఉన్న ప్రధాన సమస్య తొలగిపోతుందని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పీసీసీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, ముత్తారం సర్పంచ్ మారవేణి రాజయ్య, ఉప సర్పంచ్ గట్టు శ్రావణ్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు ఉన్నారు.

