ప్రజల ముంగిటకే ‘ప్రజా ప్రభుత్వం’
సమస్యల పరిష్కారమే పరమావధి!
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో అధికారులే మీ చెంతకు
ఇందిరమ్మ రాజ్యంలో పారదర్శక పాలన
గత పదేళ్లలో ఇళ్లు ఇవ్వలేదు.. మేం తొలి విడతలోనే 4.5 లక్షలు మంజూరు చేశాం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రాయిగూడెం ప్రజాదర్బార్‌లో అర్జీల వెల్లువ.. నేరుగా స్వీకరించిన మంత్రి
కాకతీయ, మయూరి సెంటర్ : ప్రజలు అధికారుల చుట్టూ తిరిగే రోజులు పోయాయని, అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరించే ‘ఇందిరమ్మ పాలన’ రాష్ట్రంలో కొనసాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శనివారం నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమం’లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్‌లో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్, సీపీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజల మేలు కోసమే నిరంతరం శ్రమిస్తోందని తెలిపారు. “రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో 99 రోజుల ప్రత్యేక ప్రణాళికను అధికారులు సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ప్రజాదర్బార్‌లో వచ్చిన ఫిర్యాదులను వారం, నెల, మూడు నెలల కాలపరిమితిలో పరిష్కరించేలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాం. రాజకీయాలు ఎన్నికల వరకే.. ఆ తర్వాత ప్రజలందరికీ సేవ చేయడమే మా ధ్యేయం” అని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు.. భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి
గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఇళ్లు ఇవ్వకుండా ప్రజలను వంచించిందని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి దశలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, త్వరలోనే రెండో దశ ఇళ్లను కూడా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. “భూభారతి ద్వారా అనేక భూ సమస్యలు కొలిక్కి వచ్చాయి. మిగిలిన సాదాబైనామా సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తాం. ఏప్రిల్ 27 నుంచి ప్రతి ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో రెవెన్యూ, హౌసింగ్ సమస్యలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తాం” అని మంత్రి వెల్లడించారు. మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి, ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్తున్నామని మంత్రి వివరించారు. రాయిగూడెం, అజయ్‌తండా, చెరువు మాదారం సహా 10 గ్రామ పంచాయతీల ప్రజలతో మంత్రి ముఖాముఖి భేటీ అయ్యారు. తాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా పక్కా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ.. మంత్రి వర్యులు, అన్ని శాఖల అధికారులు ఒకే వేదికపైకి రావడం ప్రజలకు గొప్ప అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న సమస్యలను గ్రామ వారీగా గుర్తించి త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వి. సీతారాములు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ రాంప్రసాద్ మరియు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

