కేసులు పెట్టడం కాంగ్రెస్‌కు అలవాటు
అభివృద్ధిని వదిలి వేధింపులకే ప్రాధాన్యం
ఆరు గ్యారెంటీలను ఎందుకు అమలు చేయడం లేదు?
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ విమర్శలు
కాకతీయ, రామకృష్ణాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం, వారిని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం అలవాటుగా మారిందని బీఆర్‌ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో భాగంగా ఆదివారం ఆయన రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో హాజరై సంతకం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. చెన్నూరు నియోజకవర్గంలో గెలిచిన మంత్రి వివేక్ వెంకటస్వామి రాజకీయ వేధింపులు మాని ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించాలని సుమన్ సూచించారు. “పాత నిధులతో జరుగుతున్న పనులనే కొత్తగా చూపిస్తూ కాలక్షేపం చేయడం కాదు.. కొత్తగా నిధులు మంజూరు చేసి అభివృద్ధిని పరుగులు తీయించాలి. నియోజకవర్గంలో జీవో నంబర్ 76కు సంబంధించిన పెండింగ్ పట్టాలను అర్హులైన ప్రజలకు తక్షణమే మంజూరు చేయాలి” అని డిమాండ్ చేశారు. ఎల్లప్పుడూ కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేయడం మానుకుని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టం చేయాలని సుమన్ నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ నాయకులు, కౌన్సిలర్లు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

