కార్మిక హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి
141వ మేడే వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
అంబేద్కర్ చౌరస్తాలో భారీ ర్యాలీకి పిలుపు
ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య
కాకతీయ, చిగురుమామిడి: ప్రపంచ కార్మికుల ఐక్యతకు ప్రతీకగా నిలిచిన మేడే వేడుకలను మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య పిలుపునిచ్చారు. 141వ మేడే వేడుకల సందర్భంగా రూపొందించిన గోడపత్రికను ఆదివారం మండల కేంద్రంలో ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన కార్మికులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల కోసం జరిగిన వీరోచిత పోరాటాల చరిత్రను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత కాలంలో కార్మికులు ఉపాధి లోపం, తక్కువ వేతనాలు, అసంఘటిత రంగంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఐక్యంగా పోరాడాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో ఉన్న లోపాలను సరిదిద్దే వరకు ఉద్యమించాలని స్పష్టం చేశారు.
గ్రామగ్రామాన ఎర్రజెండా రెపరెపలాడాలి..
మే 1వ తేదీన మండలంలోని ప్రతి గ్రామంలో కార్మికులు, రైతులు, కూలీలు, ఆటో యూనియన్ సభ్యులు కలిసికట్టుగా జెండాలు ఆవిష్కరించి కార్మిక ఐక్యతను చాటాలని కోరారు. అదేరోజు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ర్యాలీలో భవన నిర్మాణ, హమాలీ కార్మికులు, ఇతర శ్రామిక వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు గందే కొమురయ్య, పొన్నం సంపత్, హమాలీ కార్మికులు ఐలయ్య, రాజయ్య, మహేందర్, కొమురయ్య, రాయలింగు తదితరులు పాల్గొన్నారు.

