డంపు యార్డు సమస్యపై బండికి బాధ్యత లేదా?
బీజేపీ, బీఆర్ ఎస్‌ల పరస్పర సహకారం మరోసారి రుజువు
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శలు
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్లో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని, మున్సిపల్ కార్పొరేషన్ కో-ఆప్షన్ ఎన్నికలతో అది మరోసారి రుజువైందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డంపు యార్డు సమస్య పరిష్కారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. “ఏడాది క్రితం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను తీసుకువచ్చి డంపు యార్డు సహా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హడావిడి చేశారు. స్మార్ట్ సిటీ నిధులన్నీ కేంద్రానివేనని ప్రచారం చేసుకున్నారు. మరి ఇప్పుడు ఆ బాధ్యత ఏమైంది?” అని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు జంతువుల కళేబరాలు వేస్తామనడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆక్షేపించారు.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాశ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, అయితే డంపు యార్డు విషయంలో బిజెపి, బిఆర్ఎస్ నేతలు కలిసి హుజూరాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ ఇప్పటికైనా కేంద్రం నుంచి వచ్చే నిధులపై దృష్టి పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎండి తాజ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, కాంతాల జగన్ రెడ్డి, నాయకులు దండి రవీందర్, ఇట్టెపు వేణు, మ్యాకల నర్సయ్య, జీడి రమేష్, వంగల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

