మణుగూరులో గంజాయి విక్రేతల అరెస్ట్
1.085 కిలోల గంజాయి స్వాధీనం..నిందితుడికి రిమాండ్
కాకతీయ, మణుగూరు: మండలంలోని న్యూ పద్మగూడెం గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి ఒకరిని అరెస్ట్ చేశారు. మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు సీఐ నాగబాబు నేతృత్వంలో మంగళవారం పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు.
న్యూ పద్మగూడెంలోని ఓ ఇంటిలో గంజాయి నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు, అక్కడ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1.085 కిలోల గంజాయి లభ్యమైంది. ఇంటి యజమాని మిడియం గోవిందును అదుపులోకి తీసుకుని విచారించగా, గుట్టుమల్లారానికి చెందిన సాయి (అలియాస్ గుట్ట సాయి) వద్ద తాను గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. సేకరించిన గంజాయిని సత్తుపల్లికి చెందిన జుజునూరి సింహాద్రి (అలియాస్ సందీప్) అనే వ్యక్తికి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ అక్రమ రవాణాకు సంబంధించి మిడియం గోవిందు, గుట్ట సాయి, జుజునూరి సింహాద్రిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు మిడియం గోవిందును పట్టుకుని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నాగబాబు మీడియాకు తెలిపారు. గంజాయి సాగు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

