ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
కాకతీయ, శంకరపట్నం: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ (హుజూరాబాద్) ఆధ్వర్యంలో శనివారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. గ్రామంలోని పెద్ద చెరువులో మట్టి తొలగింపు పనుల్లో నిమగ్నమైన సుమారు 80 మంది కూలీలకు సర్పంచ్ దుర్గపు సుజాత-తిరుపతి చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుజాత మాట్లాడుతూ.. ఎండ తీవ్రత అధికంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఉపాధి పనులకు వచ్చే పేద కూలీలకు మజ్జిగ అందించడం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని గ్రామాల్లో నిర్వహించాలని ఆకాంక్షించారు.
ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్ మాట్లాడుతూ.. 2017 నుంచి గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ పేరిట గత పదేళ్లుగా వివిధ గ్రామాల్లో ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ ములుగురి సత్యనారాయణ, కూలీలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

