నాణ్యమైన విత్తనాలతోనే రైతుకు భరోసా
లైసెన్స్ ఉన్న కేంద్రాల్లోనే కొనుగోలు చేయాలి
తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి
జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి
కాకతీయ, కరీంనగర్: రాబోయే వానాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులు నాణ్యమైన, ధృవీకరించిన విత్తనాలనే సాగుకు ఎంపిక చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి జె. భాగ్యలక్ష్మి సూచించారు. కొత్తపల్లి రైతు వేదికలో నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని, అందుకే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
అవసరమైన మేరకే రసాయనాలు..
లైసెన్స్ ఉన్న విత్తన విక్రయ కేంద్రాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని, కొన్న ప్రతిసారీ తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని రైతులను కోరారు. యూరియా వినియోగాన్ని తగ్గించి నేల సారాన్ని కాపాడాలని, అవసరమైన మేరకే రసాయన ఎరువులు వాడాలని సూచించారు. పంట మార్పిడి విధానం పాటించడం ద్వారా సుస్థిర ఆదాయం పొందవచ్చని, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. సాగు నీటిని ఆదా చేస్తూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు.
వరి రకాలు.. ఆయిల్ పామ్ సాగుపై అవగాహన..
పొలాస ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్త డా. మధుకర్ వరిలో సాగు చేయదగిన ఉత్తమ రకాలపై రైతులకు వివరించారు. సహాయ వ్యవసాయ సంచాలకుడు కె. రణధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగు ద్వారా స్థిరమైన ఆదాయం లభిస్తుందని, దీనికి కోతుల బెడద కూడా తక్కువగా ఉంటుందని తెలిపారు. ‘ఆత్మ’ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. చత్రు నాయక్ మాట్లాడుతూ.. రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె. సంతోష్ కుమార్, ఏఈఓ చ. రాము, డీసీఎస్ వాలంటీర్ సిహెచ్ శ్రీనివాస్ మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

