నగరం క్లీన్‌గా ఉందంటే.. అది కార్మికుల కృషే
డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు
మున్సిపల్ సిబ్బందికి టవల్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ
వేతనాలు పెంచాలని కలెక్టర్‌కు విన్నపం
కాకతీయ, కరీంనగర్/భగత్‌నగర్: నగరం పరిశుభ్రంగా ఉండటంలో సఫాయి కార్మికుల కృషి వెలకట్టలేనిదని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. 42వ డివిజన్ భగత్‌నగర్‌లోని సీనియర్ సిటిజన్స్ కేర్ సెంటర్ వద్ద యోగా ట్రైనర్ మర్రి రాజేందర్ ఆధ్వర్యంలో కార్మికులకు టవల్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సునీల్ రావు.. కార్మికుల సేవలకు వందనం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. డ్రైనేజీ పనుల్లో కార్మికుల శ్రమను తగ్గించేందుకు ఆధునిక సక్షన్, జెట్టింగ్ యంత్రాలను ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ చర్యల వల్ల నగరానికి జాతీయ స్థాయిలో ‘సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్’లో ద్వితీయ స్థానం దక్కిందని గుర్తుచేశారు. కార్మికులు ఒక్కరోజు విధులకు రాకపోయినా నగరం అస్తవ్యస్తమవుతుందని, ప్రాణాలకు తెగించి వారు చేస్తున్న సేవలు అమోఘమని ప్రశంసించారు.
వేతనాల పెంపు, బీమాపై హామీ..
ప్రస్తుతం కార్మికులకు అందుతున్న రూ. 16 వేల వేతనం సరిపోదని, దీనిని రూ. 25 వేలకు పెంచాలని మే డే సందర్భంగా కలెక్టర్‌కు విన్నవించినట్లు సునీల్ రావు వెల్లడించారు. కార్మికుల భద్రత కోసం రూ. 10 లక్షల ప్రమాద బీమాతో పాటు ఆరోగ్య బీమా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వయసు పైబడిన వారు ఉద్యోగం కోల్పోతే వారి కుటుంబ సభ్యులకే ఆ అవకాశం కల్పించే విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్మికులకు అండగా నిలిచిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, పలువురు నాయకులు పాల్గొన్నారు.

