రోడ్డు ప్రమాదాలకు ‘గోల్డెన్ అవర్’ అందేనా?
ఉమ్మడి జిల్లాలో ఆందోళనకరంగా మృతుల సంఖ్య
82 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించినా తప్పని ఎదురుచూపులు
కాగితాలకే పరిమితమైన ట్రామా కేర్ సెంటర్లు
కాకతీయ, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వెరసి రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి. గతేడాది జిల్లాలో సంభవించిన 203 ప్రమాదాల్లో ఏకంగా 74 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే ‘గోల్డెన్ అవర్’లో (మొదటి గంటలో) వైద్యం అందితే ప్రాణాలు నిలిచే అవకాశం ఉన్నా, క్షేత్రస్థాయిలో సౌకర్యాల లేమి ప్రాణసంకటంగా మారుతోంది.
బ్లాక్ స్పాట్స్ గుర్తింపు.. సెంటర్ల అతీగతీ శూన్యం!
ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం ట్రామా కేర్ పాలసీని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే 82 ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) అధికారులు గుర్తించారు. అయితే ఆయా ప్రాంతాల్లో తక్షణ చికిత్స అందించేందుకు ఉద్దేశించిన ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటులో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రధానంగా జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించేలోపే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
కాగితాలకే పరిమితమైన ప్రకటనలు..
ప్రభుత్వం ప్రకటించిన ట్రామా కేర్ సెంటర్లు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద 24 గంటల పాటు అంబులెన్స్ సదుపాయం, నిపుణులైన వైద్య సిబ్బంది, మౌలిక సదుపాయాలను కల్పించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. తక్షణమే స్పందించి రహదారుల వెంట అత్యాధునిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయకపోతే, రాబోయే రోజుల్లో ప్రాణనష్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

