కూసుమంచిలో బీజేపీ శ్రేణుల సంబరాలు
మూడు రాష్ట్రాల్లో విజయకేతనంపై హర్షం
తెలంగాణలోనూ అధికారమే లక్ష్యం: నేతల వెల్లడి
కాకతీయ, కూసుమంచి: పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా కూసుమంచి మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించాయి. స్టేట్ కౌన్సిల్ మెంబర్ గడ్డం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద బాణసంచా కాల్చి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గడ్డం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకున్నారని, మమతా బెనర్జీ పాలన నుంచి విముక్తి పొందేందుకే బీజేపీని ఆదరించారని పేర్కొన్నారు. బెంగాల్ రాజకీయ చరిత్రలో బీజేపీ ఊహించిన దానికంటే భారీ స్థాయిలో సీట్లను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిందని కొనియాడారు. వరుస విజయాలతో తమ పార్టీపై ప్రజలకున్న నమ్మకం మరోసారి రుజువైందని, ఇది తమపై బాధ్యతను మరింత పెంచిందని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దాసరి వెంకటేశ్వర్లు, బానోతు హట్యా నాయక్, మండల ప్రధాన కార్యదర్శి మహేందర్ నాయక్, వడ్డెంపుల నరేష్, కూరపాటి నరేష్, కూరపాటి భాస్కర్, లక్ష్మయ్య, ఉపేందర్, మధు తదితరులు పాల్గొన్నారు.

