మత్స్యకారులను విస్మరిస్తున్న కాంగ్రెస్ సర్కార్
ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య
ఉచిత చేపపిల్లల పథకానికి రాంరాం
చెరువుల పునరుద్ధరణలో నిర్లక్ష్యం
కాకతీయ, హుజురాబాద్: రాష్ట్రంలో మత్స్యకారుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య ఆరోపించాడు. దశాబ్దాలుగా చెరువులపై ఆధారపడి జీవిస్తున్న ముదిరాజ్‌లను ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, వారి అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని విమర్శించాడు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని పేర్కొన్నాడు. రాష్ట్రంలోని చెరువులు గుఱ్ఱపుడెక్క వంటి మొక్కలతో నిండిపోయినా పూడికతీత, పునరుద్ధరణ పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించాడు.
చెరువుల్లో డ్రైనేజీ నీరు కలవడంతో నీరు కలుషితమవుతోందని, గుఱ్ఱపుడెక్కతో నిండిన నీటిలో చేపలకు ఆక్సిజన్ లేక ఎదగడం కష్టమవుతోందని తెలిపాడు. అధిక ఉష్ణోగ్రతలతో నీరు వేడెక్కి చేపలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితులతో రాష్ట్రంలో మత్స్యకారులు ఆర్థికంగా వెనుకబడుతున్నారని పేర్కొన్నాడు.
గతంలో బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2,965 చెరువుల్లో 6.38 కోట్ల నాణ్యమైన ఉచిత చేపపిల్లలు వదిలి సుమారు 5 వేల టన్నుల చేపల ఉత్పత్తి సాధించామని గుర్తుచేశాడు. చెరువులు నీటితో నిండుగా ఉండటమే ఆ ఫలితాలకు కారణమని తెలిపాడు.
ప్రజా ప్రభుత్వం అంటూ చెప్పుకుంటున్న ప్రభుత్వం మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశాడు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం గౌరవ అధ్యక్షుడు గుడ్డేల్గుల సమ్మయ్య, మాజీ అధ్యక్షులు మౌటం రవీందర్, గోస్కుల రమేష్, శంకర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

