గంజాయి గ్యాంగ్‌లపై ఉక్కుపాదం మోపాలి
భగత్‌నగర్‌లో రెండు వర్గాల ఘర్షణ.. దాడులతో వణికిన జనం
కాకతీయ, కరీంనగర్ : “నగరంలో గంజాయి బ్యాచ్‌లు రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? సామాన్య ప్రజలపై దాడులకు తెగబడుతుంటే మాకు రక్షణ ఎక్కడ?” అంటూ భగత్‌నగర్ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో శుక్రవారం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గంజాయి సేవించినట్టుగా అనుమానిస్తున్న ఓ యువకుడు స్థానికులపై దాడికి పాల్పడటంతో ఆగ్రహం చెందిన కాలనీవాసులు, మరో వర్గం యువకులతో కలిసి ప్రతిదాడికి దిగారు. ఈ పరస్పర దాడులతో భగత్‌నగర్ ప్రాంతం కొంతసేపు రణరంగంగా మారింది. సమాచారం అందుకున్న కరీంనగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘర్షణకు కారణమైన పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నిందితుడు గంజాయి మత్తులో ఈ దాడులకు తెగబడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలనీల్లో గంజాయి విక్రయాలు, సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాలనీలో అదనపు బలగాలను మోహరించి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

