ఫోక్సో నిందితుడిని కాపాడుతున్నారా?
కాంగ్రెస్-బీజేపీ‘దోస్తీ’ బయటపడింది
బీఆర్‌ఎస్ నేత రామతీర్థపు మాధవి ధ్వజం
కాకతీయ, వేములవాడ : మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదని వేములవాడ మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి ప్రశ్నించారు. ఫోక్సో కేసు నమోదైనప్పటికీ నిందితుడిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక కాంగ్రెస్, భాజపాల అంతర్గత ఒప్పందం ఉందని ఆరోపించారు. మంగళవారం వేములవాడలోని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహరావు నివాసంలో పార్టీ నాయకులతో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మైనర్ బాలికకు అన్యాయం జరిగినా మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్పందించకపోవడం సిగ్గుచేటని మాధవి విమర్శించారు. మహిళల భద్రత గురించి గొప్పలు చెప్పే నాయకులు, ఇప్పుడు మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు. నిందితుడి ప్రవర్తనపై ఫిర్యాదులు అందుతున్నా, కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే భగీరథ్‌పై లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసి, అతను దేశం విడిచి పారిపోకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉదాసీన వైఖరి వీడి నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంగళ అనిత, మహిళా నాయకురాలు జంగిటి శ్రీనిధి, మామిండ్ల జమునతో పాటు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, సిరిగిరి చందు, మారం కుమార్, గోలి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

