సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత
భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కూనంనేని
కాకతీయ, కొత్తగూడెం: హనుమాన్ జయంతి పర్వదినం భక్తిశ్రద్ధల సమాహారమని, మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నియోజకవర్గ పరిధిలోని పలు దేవాలయాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతతో పాటు ప్రతి ఒక్కరిలో సామాజిక బాధ్యత ఉండాలని సూచించారు. అన్నప్రసాద వితరణ వంటి గొప్ప సేవా కార్యక్రమాలు సమాజంలో మార్పునకు నాంది పలుకుతాయన్నారు. సేవా దృక్పథంతోనే ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. హనుమంతుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, కొత్తగూడెం మున్సిపల్ మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, నాయకులు మొహమ్మద్ యూసుఫ్, బోయిన విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

