వివాహితకు ప్రేమ పేరుతో సీఐ వల!
న్యాయం కోసం వస్తే నమ్మించి మోసం
బలవంతంగా అబార్షన్ చేయించారంటూ బాధితురాలి ఫిర్యాదు
ఖమ్మం సీఐ రాజు నాయక్‌పై కేసు
డీజీపీ కార్యాలయానికి అటాచ్
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ భూక్యా రాజు నాయక్.. న్యాయం కోసం వచ్చిన ఒక వివాహితను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై కేసు నమోదైంది. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని, ఆ తర్వాత బలవంతంగా టాబ్లెట్లు మింగించడంతో ఆమెకు అబార్షన్ అయిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆపై ఆమెను మరింత వేధించడంతో ఈ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. 2023లో సదరు మహిళ తన భర్త తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది. అక్కడ అప్పట్లో విధులు నిర్వహిస్తున్న సీఐ రాజు నాయక్, బాధితురాలి నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడటం ప్రారంభించాడు. క్రమంగా ఆమెను నమ్మించి లొంగదీసుకున్నాడు. వీరిద్దరూ కొంతకాలం పాటు సహజీవనం కూడా చేసినట్లు సమాచారం.
డీజీపీ ఆఫీసుకు బదిలీ.. సీఐ పరారీ
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు సీఐ రాజు నాయక్‌పై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు సదరు సీఐని హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన స్థానంలో మరొక అధికారిని నియమించారు. కేసు నమోదైనప్పటి నుండి సదరు సీఐ పరారీలో ఉన్నాడని, అయితే రెండు రోజుల క్రితమే ఆయన న్యాయస్థానం నుండి ముందస్తు బెయిల్ పొందినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

