ఒక్క క్లిక్‌తో ఇంటి నుంచే ప్రభుత్వ సేవలు!
కరీంనగర్‌లో సరికొత్త డిజిటల్ పాలనకు శ్రీకారం
తమిళనాడు నమూనాలో ఈ-గవర్నెన్స్ విస్తరణకు కార్యాచరణ
ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలకు చెల్లు.. మధ్యవర్తుల దందాకు బ్రేక్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు అధికారులు డిజిటల్ పాలనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. తమిళనాడులో అమలవుతున్న సరళీకృత ఈ-గవర్నెన్స్ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని జిల్లాలో సేవల సరళీకరణకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్, పింఛన్లు, రేషన్, భూ సమస్యలు, ధృవపత్రాల జారీ వంటి కీలక సేవలను ఒకే వేదికపై ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్న ప్రజలకు, కొత్త విధానంతో ఇంటి దగ్గర నుంచే దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. దరఖాస్తుల స్థితి, పెండింగ్ ఫైళ్లు, అధికారుల పనితీరు వంటి అంశాలను ప్రత్యేక పర్యవేక్షణ బోర్డుల ద్వారా పర్యవేక్షించే విధంగా సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. ప్రతి సేవకు నిర్దిష్ట గడువు నిర్ణయించి ఆలస్యం జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకునే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు సేవల పంపిణీని సమర్థవంతంగా మార్చేందుకు సమాచార సాంకేతిక ఆధారిత వ్యవస్థలను బలోపేతం చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
దళారీల దోపిడీకి శాశ్వతంగా చెక్
ప్రజలకు వేగవంతమైన సేవలతో పాటు అవినీతి, మధ్యవర్తిత్వానికి అడ్డుకట్ట వేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. డిజిటల్ సేవల విస్తరణతో ప్రభుత్వ కార్యాలయాల్లో రద్దీ తగ్గడంతో పాటు ప్రజలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే పైలట్ ప్రాజెక్ట్ రూపంలో కొన్ని సేవలను ప్రారంభించే అవకాశమున్నట్లు సమాచారం.

