నిప్పంటించడంతో కూలిపోయిన భారీ వృక్షం..
ముదిగొండ–మేడిపల్లి రహదారిపై ప్రజలకు నరకయాతన
కాకతీయ, ముదిగొండ : ఖమ్మం జిల్లా ముదిగొండ నుండి మేడిపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై భారీ వృక్షానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో అది పూర్తిగా బలహీనపడి చివరకు రోడ్డుపై కూలిపోయింది. రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టు కారణంగా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర పనుల కోసం వెళ్లేవారు రోడ్డుపైనే చిక్కుకుపోయారు.
చెట్టు వేర్ల వద్ద మంటలు చెలరేగి భారీగా పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాలిపోయిన చెట్టు ఒక్కసారిగా కూలిపోవడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది.
అయితే ఘటన జరిగినప్పటికీ అధికారులు వెంటనే స్పందించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “రోడ్డు పూర్తిగా మూసుకుపోయినా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని” వాహనదారులు మండిపడుతున్నారు. భారీ వాహనాలు, బస్సులు కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడటంతో కొందరు ప్రాణాలను పణంగా పెట్టి పక్కదారుల్లో ప్రయాణించాల్సి వచ్చింది.
ఇప్పటికైనా జిల్లా అధికారులు, అటవీ శాఖ మరియు రోడ్డు శాఖ సిబ్బంది తక్షణమే చర్యలు తీసుకుని కూలిపోయిన చెట్టును తొలగించి రహదారిని సాధారణ రాకపోకలకు అనుకూలంగా మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

