నిరుపేద కుటుంబానికి అండగా గ్రామ యువత
మహిళ మరణంతో ఇల్లు లేక ఇబ్బంది పడ్డ కుటుంబం
యువజన సంఘం భవనంలో అంతిమ సంస్కారాలు
సర్పంచ్, ఉపసర్పంచ్ ఆర్థిక సహాయం
కాకతీయ, ఇల్లంతకుంట : అనారోగ్యంతో మృతి చెందిన కీర్తి భారతి(65) అనే నిరుపేద మహిళకు మరణానంతరం మృతదేహాన్ని ఉంచేందుకు ఇల్లు కూడా లేని హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. భర్త, కూతురు ముందే మృతి చెందడంతో ఒంటరిగా ఉంటున్న ఆమె మరణించగా.. శవాన్ని ఎక్కడ ఉంచాలో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ ఎం. రాజు, యువజన సంఘాల అధ్యక్షుడు రేగుల కార్తీక్, సభ్యులతో మాట్లాడి మృతదేహాన్ని యువజన సంఘ భవనానికి తరలించారు. శవం పాడవకుండా ఫ్రీజర్ ఏర్పాటు చేసి రాత్రంతా భద్రపరిచారు. బుధవారం ఉదయం బంధువులు, గ్రామస్థుల కడసారి చూపు అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎం. రాజు రూ.10 వేలు, ఉపసర్పంచ్ మూగు నాగరాజు శర్మ రూ.5,116 ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి ధైర్యం చెప్పారు. భవిష్యత్తులోనూ గ్రామంలోని నిరుపేదలు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటే యువజన సంఘ భవనాన్ని వినియోగించుకోవచ్చని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చేరాల వంశీకృష్ణ, అంతటి శ్రీకాంత్, గ్రామస్థులు పాల్గొన్నారు.

