ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా పెండ్యాల
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎదిగిన విజయభాస్కర్
అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా నియామక పత్రం
కాకతీయ జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందిన పెండ్యాల విజయభాస్కర్ ఆర్యవైశ్య మహాసభలో అంచలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని మహాసభ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. మూడున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ధారా రామనరసింహం ప్రోత్సాహంతో సభ్యత్వం తీసుకున్న విజయభాస్కర్.. యువజన సంఘం మండల స్థాయి నుంచి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లాల విభజన తర్వాత భద్రాద్రి జిల్లా తొలి కన్వీనర్‌గా, ప్రస్తుతం గౌరవాధ్యక్షుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. మహాసభ అభివృద్ధికి, సభ్యత్వ నమోదుకు ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ రాష్ట్ర నాయకత్వం ఈ పదవిని అప్పగించింది. ఈ సందర్భంగా విజయభాస్కర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. మహాసభ బలోపేతానికి, పేద ఆర్యవైశ్యుల సంక్షేమానికి శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వనమా విశ్వేశ్వరరావు, కైలాస రామచంద్రరావు, పలభట్ల ఆనందబాబు, ఆగిరి వెంకటేష్, పులిపాటి ప్రసాద్, నూకల వాసు పాల్గొన్నారు.

