ఇసుక లారీని ఢీకొట్టిన కారు..
సిద్దిపేటలో మణుగూరు దంపతుల మృతి!
కారులో ప్రయాణిస్తున్న కుమారుడు, కోడలికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
‘రవి గ్రాఫిక్స్’ రవిగా మణుగూరులో సుపరిచితుడు
మణుగూరులో అలుముకున్న విషాద ఛాయలు
కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన దంపతులు ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషాద ఘటన సిద్దిపేట ప్రాంతంలో చోటుచేసుకుంది. మణుగూరులో ‘రవి గ్రాఫిక్స్’ నిర్వహిస్తూ అందరికీ సుపరిచితులైన రవి, ఆయన భార్య సునీత ప్రయాణిస్తున్న కారు.. రోడ్డుపై ముందు వెళ్తున్న ఇసుక లారీని అతివేగంగా వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీ కిందకు కారు దూసుకుపోవడంతో రవి, సునీత దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కుమారుడు, కోడలి పరిస్థితి విషమం
ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న వారి కుమారుడు, కోడలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, హైవే పోలీసులు వెంటనే స్పందించి కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన కుమారుడు, కోడలిని తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వ్యాపార రంగంలో ఎంతో యాక్టివ్గా ఉంటూ అందరితో కలుపుగోలుగా ఉండే రవి, సునీత దంపతులు అకాల మరణం చెందారనే వార్త తెలియగానే మణుగూరు ప్రాంతంలో ఒక్కసారిగా పెను విషాదం అలుముకుంది. వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. అతివేగమా లేదా డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల కుటుంబానికి మణుగూరు వ్యాపార ప్రముఖులు, స్థానిక నాయకులు తమ గాఢ సంతాపాన్ని ప్రకటించారు.

