హుజూరాబాద్ కాంగ్రెస్ కంచుకోట
బీఆర్ఎస్ పాలనలో నిధులు మాయం, అభివృద్ధి శూన్యం
మళ్లీ మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్
కాకతీయ, కరీంనగర్/హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలోపేతమవుతోందని, రానున్న ఎన్నికల్లో తప్పకుండా పార్టీ జెండాను ఎగురవేస్తామని నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రతాప్సాయి గార్డెన్లో శనివారం నిర్వహించిన బీఎల్ఏల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉప ఎన్నికల తర్వాత హుజూరాబాద్ అభివృద్ధికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూపాయి కూడా కేటాయించలేదని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్‌గా ఉన్నప్పటికీ పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా తీసుకొచ్చిన నిధులు ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల సమయంలో ప్రకటించిన పనులకు కూడా నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. హుజూరాబాద్ మున్సిపాలిటీపై ఇప్పటికే కాంగ్రెస్ జెండా ఎగిరిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజల మద్దతు తమకే ఉందని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని, మక్కలు, వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని చెప్పారు. జమ్మికుంట మార్కెట్లో లక్ష క్వింటాళ్లకు పైగా మక్కలను కొనుగోలు చేశామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని ప్రణవ్ పేర్కొన్నారు. దళిత బంధు పథకం రెండేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఎందుకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్ రావు హుజూరాబాద్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఇప్పుడు మరోసారి హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, వైస్ చైర్పర్సన్ అంజలి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

