రూ.కోటి గంజాయి పట్టివేత
ఐదుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్
ఖమ్మం జిల్లా కొణిజర్లలో పోలీసుల మెరుపు దాడి
రూ.కోటి విలువైన 201 కేజీల ఎండు గంజాయి స్వాధీనం
పైలట్ వాహనంతో సహా రెండు కార్లు సీజ్
మహారాష్ట్ర, తెలంగాణ కేంద్రంగా సాగుతున్న అక్రమ రవాణా
పరారీలో ప్రధాన సూత్రధారులు.. ముమ్మర గాలింపు ప్రారంభం
కాకతీయ,ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో భారీ గంజాయి ముఠా గుట్టురట్టయింది. అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలకు పైగా విలువైన 201 కేజీల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, ఐదుగురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు కొణిజర్ల ఎస్సై సూరజ్ వివరాలను వెల్లడించారు. వైరా ఏసీపీ సారంగపాణి ఆదేశాల మేరకు, శనివారం కొణిజర్ల హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. వైరా వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఒక బొలెరో వాహనాన్ని , దానికి పైలట్‌గా వస్తున్న మారుతీ డిజైర్ కారును పోలీసులు అనుమానాస్పదంగా గుర్తించి నిలిపివేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అందులో అక్రమంగా ఎండు గంజాయి తరలిస్తున్నట్లు వెల్లడైంది. వెంటనే పోలీసులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు.
మహారాష్ట్ర, తెలంగాణ కేంద్రంగా ముఠా
అరెస్ట్ అయిన వారిలో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన అమూల్ నానోబా గోరే, లక్ష్మణ్ నాగనాథ్ కరే ఉండగా, తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందిన వసంత జాధవ్, షేక్ ఆన్సర్, షేక్ రహ్మత్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ. 1,00,50,000 విలువైన 201.45 కేజీల ఎండు గంజాయితో పాటు, రెండు వాహనాలు, ఏడు సెల్ ఫోన్లు, రూ. 2,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. అయితే, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన సరఫరాదారులు, గంజాయిని స్వీకరించాల్సిన రిసీవర్లు పరారీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. మత్తు పదార్థాల రవాణాకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

