మణుగూరులో నిలిచిన రోడ్డు పనులు
మధ్యలోనే ఆగిపోయిన రూ. 11 కోట్ల పనులు
విద్యార్థులు, వాహనదారులకు అవస్థలు
వారం రోజుల్లో పనులు ప్రారంభించకపోతే ఆందోళనలు
సీపీఎం మండల కార్యదర్శి సాంబశివరావు
కాకతీయ, మణుగూరు : మణుగూరు డిగ్రీ కాలేజ్ నుంచి రైల్వే గేట్ వరకు చేపట్టిన రహదారి పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం మండల కార్యదర్శి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, ఈ రహదారి అభివృద్ధికి ప్రభుత్వం రూ. 11 కోట్లు మంజూరు చేసినప్పటికీ, పనులు పూర్తికాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. డిగ్రీ కాలేజ్, రైల్వే గేట్ మార్గం నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమని, వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఈ దారిలోనే ప్రయాణిస్తారని సాంబశివరావు గుర్తుచేశారు. పనులు ఆగిపోవడంతో రోడ్డు గుంతలమయంగా మారి, మట్టి, దుమ్ముతో ప్రయాణానికి పనికిరాకుండా తయారైందని ఆయన తెలిపారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ఈ రోడ్డు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని, తద్వారా భారీ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారుల తీరుపై ఆగ్రహం
నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ఆయన అధికారులను ప్రశ్నించారు. “కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై పనులను జాప్యం చేస్తున్నారా?” అని నిలదీశారు. ప్రజల పన్నుల సొమ్ముతో చేపట్టిన పనులను దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వారం రోజుల్లోగా పనులను పునఃప్రారంభించి, వేగంగా పూర్తి చేయాలని, లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి రోడ్డెక్కి ఆందోళన చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

