స్వర్ణకారుల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
జీవనోపాధి దెబ్బతింటున్న సంప్రదాయ స్వర్ణకారులు
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన సంఘం ప్రతినిధులు
కాకతీయ, ఇల్లంతకుంట: స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ మండల స్వర్ణకార సంఘం నాయకులు తహసీల్దార్ రాచకట్ల సురేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వెగ్గళ్లం రాధాకిషన్, విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు చిలుముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ జీవన పరిస్థితులు మెరుగుపడతాయని ఆశించామని, కానీ కార్పొరేట్ జ్యువెలరీ సంస్థల విస్తరణతో సంప్రదాయ స్వర్ణకారుల జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలక మండలిని నియమించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే జీవో 272ను పటిష్టంగా అమలు చేయాలని, 50 ఏళ్లు దాటిన స్వర్ణకారులకు గీత, నేత కార్మికుల తరహాలో నెలకు 5,000 రూపాయల పింఛన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మారుపాక అనిల్ కుమార్, అనుపురం చిరంజీవి, చిలుముల రమేష్, కట్ట రవీంద్రాచారి, వెగ్గళ్ల శ్రీను, వెగ్గళ్ల విజయ్, పరిపూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.

